RTO: రాష్ట్రం మారినా వాహన రిజిస్ట్రేషన్​ మార్చాల్సిన అవసరం లేదు.. కొత్త ‘సిరీస్​’ను తీసుకొచ్చిన కేంద్రం

Union Government Issued Notification For BH series For Vehicles

  • ‘బీహెచ్’ సిరీస్ పై నోటిఫికేషన్
  • తొలుత రెండేళ్లకే పన్ను కట్టే వెసులుబాటు
  • ఆర్టీవోకు వెళ్లకుండా ఆన్ లైన్ లోనే ప్రక్రియ

ఇప్పటిదాకా ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని వేరే రాష్ట్రంలో నడుపుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ను మార్చాల్సి ఉండేది. ఇకపై రాష్ట్రం మారినా వాహన రిజిస్ట్రేషన్ ను మార్చాల్సిన అవసరమే లేదు. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చింది. ఓ కొత్త సిరీస్ ను తీసుకొచ్చింది. దాని పేరు ‘భారత్ సిరీస్’ లేదా సింపుల్ గా ‘బీహెచ్’ సిరీస్. ఇవాళ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ను కేంద్ర రోడ్లు, రవాణ, హైవేల మంత్రిత్వ శాఖ జారీ చేసింది.

వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలోనే ‘బీహెచ్’ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేయించుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. అది కూడా ఆర్టీవోకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే బీహెచ్ రిజిస్ట్రేషన్ ను చేసుకోవచ్చు. రోడ్డు పన్నును మొదట రెండేళ్లకే కట్టొచ్చు. లేదంటే వాహన గరిష్ఠ జీవితకాలమైన 15 ఏళ్లకుగానూ రెండేళ్ల చొప్పున మొత్తం ఒకేసారి కట్టొచ్చు. వాహన జీవిత కాలం పూర్తయిన తర్వాత ఇంతకుముందు కట్టిన విధానం ప్రకారం ఆ మొత్తంలో సగం చొప్పున ప్రతి ఏటా వాహన పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కొత్త విధానంతో ఉద్యోగ, వ్యాపార కారణాలతో వేరే రాష్ట్రానికి మారాల్సి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ అధికారులు– సిబ్బంది, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు.. నాలుగు  లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలలో వ్యాపారం నిర్వహించే  ప్రైవేట్ రంగంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలకు చెందిన ప్రతినిధులకు లబ్ధి జరగనుంది.  

ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని.. వేరే రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఏడాది పాటు నడుపుకోవచ్చు. ఆ తర్వాత కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. అందుకు 10 లేదా 12 ఏళ్లకుగానూ రోడ్డు పన్నును చెల్లించాలి. మొదటి రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు చెల్లించిన పన్ను రీఫండ్ కోసం అంతకుముందున్న రాష్ట్రానికి క్లెయిమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంత సంక్లిష్టమైన ప్రక్రియను సరళీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం బీహెచ్ సిరీస్ ను తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News