Amrullah Saleh: తమ గురువు నుంచి చాలా నేర్చుకున్నారు: తాలిబన్లను, పాక్ ను కలిపి విమర్శించిన అమృల్లా సలేహ్
- కాబూల్ లో భారీ ఉగ్రదాడి
- తమ పనే అని ప్రకటించుకున్న ఐసిస్-ఖొరాసన్
- ఐసిస్ తో లింకులపై తాలిబన్ల ఖండన
- స్పందించిన సలేహ్
కాబూల్ లో జరిగిన ఉగ్రదాడులపై ఆఫ్ఘనిస్థాన్ స్వయంప్రకటిత ఆపద్ధర్మ అధ్యక్షుడు అమృల్లా సలేహ్ స్పందించారు. ఈ దాడులకు తమదే బాధ్యత అని ఐసిస్ ప్రకటించిన నేపథ్యంలో ఆయన తాలిబన్లపైనా, పాకిస్థాన్ పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐసిస్ తో సంబంధాలు లేవని తాలిబన్లు చెబుతుండడాన్ని ఆయన ఖండించారు. తాలిబన్ల వైఖరి చూస్తే, గతంలో ఖ్వెట్టా షురూ అనే మిలిటెంట్ సంస్థతో సంబంధాలు లేవని పాకిస్థాన్ చెప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తమ గురువు (పాకిస్థాన్) నుంచి తాలిబన్లు చాలా నేర్చుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు.
"ఏ విధంగా చూసినా కాబూల్ ఉగ్రదాడికి పాల్పడిన ఐసిస్-ఖొరసాన్ మూలాలు తాలిబన్లు-హక్కానీ నెట్వర్క్ లోనే ఉన్నాయి. కాబూల్ లో ఉగ్రదాడికి పాల్పడింది కచ్చితంగా తాలిబన్లతో సంబంధాలు ఉన్నవారే" అని సలేహ్ స్పష్టం చేశారు.
తాలిబన్లు ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ ను ఆక్రమించుకోవడంతో దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. దాంతో తనకే దేశాధ్యక్ష అర్హతలున్నాయంటూ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ తనను తాను ఆపద్ధర్మ దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ప్రస్తుతం ఆయన పంజ్ షీర్ లోయలో ఉన్నారు.