Afghanistan: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్.. సురక్షితంగా తప్పించుకున్న భారతీయులు
- కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద 6 వరుస పేలుళ్లు
- పేలుళ్లకు ముందే 160 మంది ఇండియాకు తరలింపు
- సామాన్యుల ముసుగులో ఎయిర్ పోర్టులోకి టెర్రరిస్టులు వస్తున్నారని అనుమానం
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ బాంబు దాడులతో దద్దరిల్లింది. ఇప్పటి వరకు 6 పేలుళ్లు జరగగా... 90 మంది మృతి చెందారు. వీరిలో 13 మంది అమెరికా సైనికులు కాగా, మిగతా వారు సాధారణ పౌరులు. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
మరోవైపు ఈ పేలుళ్ల నుంచి 160 మంది భారతీయులు సురక్షితంగా తప్పించుకున్నారు. వీరిలో 145 మంది సిక్కులు కాగా, 15 మంది హిందువులు. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద బాంబు పేలుళ్లు సంభవించడానికి కొన్ని గంటల ముందే వీరందరినీ అక్కడి నుంచి భారత్ కు తరలించారు.
ఆప్ఘన్ లో ఇంకా వేలాది మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. తాజా పేలుళ్ల నేపథ్యంలో అక్కడి నుంచి ప్రజలను తరలించడం మరింత క్లిష్టంగా మారింది. ఎయిర్ పోర్టు లోపల ఉన్నవారు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నప్పటికీ... ఎయిర్ పోర్టు బయటి పరిస్థితి దారుణంగా ఉంది. మరోవైపు సామాన్యుల ముసుగులో ఉగ్రవాదులు కూడా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించే అవకాశం ఉందనే అనుమానాలు భయాలను మరింత పెంచుతున్నాయి.