Chhattisgarh: భార్యతో బలవంతపు శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేం: చత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు
- చట్టబద్ధ వైవాహిక జీవితంలో భార్య వయసు 18 ఏళ్లు నిండితే చాలు
- బలవంతంగా అయినా అది నేరం కాదు
- 37 ఏళ్ల బాధిత భర్తకు కేసు నుంచి విముక్తి
- ఇతర అభియోగాలు కొనసాగుతాయని స్పష్టీకరణ
చట్టబద్ధమైన వైవాహిక జీవితంలో భార్యతో బలవంతంగా శృంగారం చేయడాన్ని నేరంగా పరిగణించలేమంటూ చత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా వైవాహిక అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న 37 ఏళ్ల బాధిత భర్తకు ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న యువతి వయసు 18 ఏళ్లలోపు లేకుంటే ఆమెతో బలవంతంగా శృంగారం జరిపినా అది నేరం కిందికి రాదని స్పష్టం చేసింది.
ఈ కేసులో ఫిర్యాదుదారు, అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి చట్టబద్ధంగా భార్యాభర్తలని, కాబట్టి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అతడు ఆమెతో బలవంతంగా శృంగారంలో పాల్గొన్నా దానిని అత్యాచారంగా పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. అయితే, అసహజ శృంగారంతోపాటు అతడిపై నమోదైన ఇతర అభియోగాలు మాత్రం కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది.