Maharashtra: గంజాయికి అద్భుతమైన ధర ఉంది.. అనుమతిస్తే సాగుచేసుకుంటా!: రైతు వినతితో విస్తుపోయిన అధికారులు
- మార్కెట్లో ఏ పంటకూ సరైన గిట్టబాటు ధర రావడం లేదు
- సెప్టెంబరు 15లోపు అనుమతి ఇవ్వండి
- నాకున్న రెండెకరాల్లో గంజాయి సాగుచేస్తా
- కలెక్టర్‌కు లేఖ రాసిన మహారాష్ట్ర రైతు
మార్కెట్లో ఏ పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. ఫలితంగా పెట్టుబడి కూడా రాక రైతులు అవస్థలు పడుతున్నారు. పంట ఏదైనా మార్కెట్లో ఇదే పరిస్థితి. ‘కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి’లా తయారైంది రైతుల పరిస్థితి. ఈ నేపథ్యంలో విసిగివేసారిపోయిన ఓ రైతు అధికారులకు రాసిన లేఖ సంచలనమైంది.
మార్కెట్లో ఏ పంట ఉత్పత్తికీ స్థిరమైన ధరలేదని, ప్రభుత్వ నిషేధిత గంజాయికి మాత్రం మార్కెట్లో మంచి ధర ఉందని, కాబట్టి అనుమతి ఇస్తే సాగుచేసుకుంటానంటూ సదరు రైతు మొరపెట్టుకున్నాడు. ఈ లేఖ చూసిన అధికారులు విస్తుపోయారు.
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా మొహోల్ తహసీల్‌కు చెందిన అనిల్ పాటిల్ అనే రైతు కలెక్టర్‌కు ఈ లేఖ రాశాడు. ఏ పంట సాగుచేసినా కష్టాలు తప్పడం లేదని, కనీసం గిట్టుబాటు ధర కూడా రావడం లేదని అనిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. చక్కెర కర్మాగారాలకు అమ్మిన చెరకు బకాయిలు కూడా ఇంకా అందలేదని వాపోయాడు. మార్కెట్లో గంజాయికి మంచి ధర పలుకుతోందని, అనుమతి ఇస్తే తనకున్న రెండెకరాల్లోనూ గంజాయిని సాగుచేస్తానని ఆ లేఖలో అనుమతి కోరాడు.
అంతేకాదు, సెప్టెంబరు 15 లోపు జవాబు ఇవ్వాలని, ఆ గడువు దాటితే మీరు అనుమతి ఇచ్చారనే భావించి సాగు ప్రారంభిస్తానని కూడా పేర్కొన్నాడు. అక్కడితో ఆగలేదు.. ఇందుకు తనను బాధ్యుడిని చేసి నేరం మోపితే అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించాడు. ఈ లేఖను చూసిన అధికారులు దానిని పోలీసులకు పంపారు. ఇదే విషయమై మొహోల్ పోలీసులు మాట్లాడుతూ.. ప్రచారం కోసమే రైతు ఈ లేఖ రాశాడని కొట్టిపడేశారు. గంజాయి సాగుచేస్తే కేసు తప్పదని హెచ్చరించారు.