Afghanistan: ఎట్టకేలకు దేశం దాటిన ఆఫ్ఘన్ మహిళా ఫుట్‌బాలర్లు

Women football players leave Afghanistan on evacuation flight

  • ఆస్ట్రేలియా విమానంలో తరలించిన 75 మందిలో క్రీడాకారిణులు
  • తాలిబన్ల రాజ్యంలో భవితవ్యంపై పలువురి ఆందోళన
  • ఇది ముఖ్యమైన విజయమన్న మాజీ సారధి ఖలీదా పోపల్

తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల భద్రతపై పలు ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా మహిళా క్రీడాకారులు ఎటువంటి క్రూరమైన అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అసలు వాళ్లను తాలిబన్లు ప్రాణాలతో ఉండనిస్తారా?  అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ మహిళా ఫుట్‌బాల్ జట్టు సభ్యులు దేశం దాటేసినట్లు సమాచారం.

ఈ క్రీడాకారిణుల జీవితాల్లో ఇది చాలా ముఖ్యమైన విజయమని జట్టు మాజీ సారధి ఖలీదా పోపల్ అన్నారు. కొన్ని రోజులుగా వార్తల్లో నిలిచిన ఆమె.. ఆఫ్ఘన్ క్రీడాకారిణులకు పలు హెచ్చరికలు చేశారు. సోషల్ మీడియా ప్రొఫైల్స్ తొలగించాలని, ఫొటోలు తగలబెట్టేయాలని, పారిపోయి ఎక్కడైనా తలదాచుకోవాలని ఆమె సూచించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన ఒక విమానం మంగళవారం నాడు 75 మంది ఆఫ్ఘన్లను తరలించింది. వీరిలో ఆఫ్ఘన్ మహిళా ఫుట్‌బాల్ జట్టు సభ్యులు కూడా ఉన్నారు. దీనిపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్ల సమాఖ్య ఫిఫ్‌ప్రో (ఎఫ్ఐఎఫ్‌పీఆర్‌వో) హర్షం వ్యక్తం చేసింది. జట్టు సభ్యులు, వారి కుటుంబాలను ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలించినందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది.

‘‘కొన్ని రోజులుగా చాలా ఒత్తిడిలో గడిచినా.. చివరకు మనం ఒక ముఖ్యమైన విజయం సాధించాం’’ అని ఖలీదా పోపల్ అన్నారు. క్రీడాకారిణులు, వారి కుటుంబాలను తరలించడం కోసం ఫిఫ్‌ప్రో కు చెందిన లాయర్లు, సలహాదారుల బృందం ఆరు దేశాలతో చర్చలు జరిపింది. ఈ జాబితాలో అమెరికా, ఆస్ట్రేలియా, యూకే తదితర దేశాలున్నాయి. ఈ దేశాలతో చర్చలు జరిపిన ఫిఫ్‌ప్రో బృందంలో ఖలీదా కూడా సభ్యురాలిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News