Colonel rank: సైన్యంలో ఐదుగురు మహిళా అధికారులకు కర్నల్‌ హోదా

Colonel rank for five women officers in the army

  • 26 ఏళ్ల సేవ తర్వాత కర్నల్‌ ర్యాంక్
  • ప్రకటన విడుదల చేసిన రక్షణ శాఖ
  • ఈ రంగాల్లో మహిళలకు కర్నల్‌ హోదా ఇదే తొలిసారి
  • సైన్యంలో లింగ సమానత్వం వైపు ఆర్మీ అడుగన్న రక్షణ శాఖ

భారత సైన్యంలో ఐదుగురు మహిళలకు కర్నల్‌ హోదా దక్కింది. 26 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఈ అధికారిణులకు కర్నల్‌ హోదాకు పదోన్నతి ఇస్తున్నట్లు భారత సైన్యం ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మెడికల్, లీగల్, ఎడ్యుకేషన్ రంగాలు కాకుండా ఇతర రంగాల్లోని మహిళా అధికారులకు ఇలా కర్నల్‌ హోదా దక్కడం ఇదే తొలిసారి.

మహిళా అధికారులకు పర్మినెంట్ కమీషన్ ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్మీలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇలా పదోన్నతులు లభించే విభాగాలు పెరగడం వల్ల ఆర్మీలో మహిళలకు కెరీర్ అవకాశాల్లో వృద్ధి కనిపిస్తుందని ఆర్మీ పేర్కొంది. అలాగే లింగ సమానత్వం దిశగా ఆర్మీ తీసుకుంటున్న చర్యలకు ఈ నిర్ణయం అద్దం పడుతుందని తెలిపింది.

కొత్తగా కర్నల్‌ హోదా దక్కించుకున్న మహిళా అధికారులు.. కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్, కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఈఎమ్ఈ), కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌ విభాగాలకు చెందినవాళ్లు కావడం గమనార్హం. వీళ్లందరూ కూడా లెఫ్టినెంట్ కర్నల్‌ హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి పేర్లు వరుసగా లెఫ్టినెంట్ కల్నల్ సంగీతా శార్దన (కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్), సోనియా ఆనంద్, నవనీత్ దుగ్గల్ (కార్ప్స్ ఆఫ్ ఈఎమ్ఈ), రీనూ ఖన్నా, రిచా సాగర్ (కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్).

  • Loading...

More Telugu News