Venkaiah Naidu: దేశ నాగరికతను, సంస్కృతిని తెలుసుకోవడానికి జానపద విజ్ఞానమే మొదటి మార్గం: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- కర్ణాటకలో వెంకయ్యనాయుడు పర్యటన
- బెంగళూరులో వర్చువల్ జానపద కళా ఉత్సవం
- హాజరైన వెంకయ్య
- జానపదాలపై అభిప్రాయ వ్యక్తీకరణ
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఇవాళ బెంగళూరులో జరిగిన ఓ వర్చువల్ జానపద కళా ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై తన అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జానపద కళాకారులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకం అని పేర్కొన్నారు.
జానపద సంపద లేకుండా అభివృద్ధి చెందిన భాష కానీ, సంస్కృతి కానీ, నాగరికత కానీ లేవని పేర్కొన్నారు. ఒక దేశ నాగరికతను, సంస్కృతిని తెలుసుకునేందుకు జానపద విజ్ఞానమే మొదటి మార్గం అని తెలిపారు. కళలు, చేతిపనులు, పనిముట్లు, దుస్తులు, ఆచారవ్యవహారాలు, నమ్మకాలు, వైద్యం, వంటలు, సంగీతం, నృత్యం, క్రీడలు, హావభావాలు, భాష ఇత్యాది అంశాల సమాహారమే జానపద విజ్ఞానం అని వెంకయ్యనాయుడు నిర్వచించారు.
మానవ వికాసం తొలినాళ్లలో శ్రమను మరిచిపోయేందుకు పుట్టిన జానపదాలు, తర్వాత కాలంలో సామాజిక రుగ్మతల మీద ఎక్కుపెట్టిన అస్త్రాలయ్యాయని ఉద్ఘాటించారు. జానపదాలు స్వాతంత్ర్య ఉద్యమంలోనూ ప్రజలను చైతన్యవంతులను చేశాయని వెల్లడించారు. ఇటీవల కరోనా పరిస్థితుల్లోనూ ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో జానపద కళాకారులు పోషించిన పాత్ర అభినందనీయం అని పేర్కొన్నారు.
ఇప్పటి యువతరానికి జానపద సాహిత్యంపై అవగాహన పెరగాలని, ముందుతరాలకు జానపదాల గొప్పదనాన్ని తెలియజేసేలా సృజనాత్మక మార్గాల మీద దృష్టి పెట్టాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. భాష, సంస్కృతులకు మూలమైన జానపద వాజ్ఞ్మయాన్ని కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.