Kartarpur Sahib: కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాకు సిక్కు యాత్రికులను అనుమతించాలని పాక్ నిర్ణయం
- వచ్చే నెల 22న గురునానక్ వర్ధంతి
- కర్తార్ పూర్ గురుద్వారా తెరవనున్న పాక్
- పెద్దఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం
- భక్తులకు ఆంక్షలతో అనుమతి
ఓవైపు కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలోనూ పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాకు వచ్చే నెల నుంచి భక్తులను అనుమతించనున్నట్టు వెల్లడించింది. సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురు నానక్ దేవ్ వర్థంతి సెప్టెంబరు 22న కాగా, కర్తార్ పూర్ పుణ్యక్షేత్రాన్ని సిక్కు యాత్రికుల సందర్శనార్థం తెరవాలని పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్సీఓసీ) నిర్ణయించింది. సిక్కు భక్తులను అనుమతించాలని, కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎన్సీఓసీ సమావేశంలో తీర్మానించారు.
ప్రస్తుతం పాక్ లో అడుగుపెట్టేవారు వ్యాక్సిన్ రెండు డోసులు పొంది ఉండాలని, ఆర్టీ-పీసీఆర్ టెస్టు ఫలితాలు కూడా సమర్పించాలని అక్కడి ప్రభుత్వం నిబంధనలు విధించింది. పాకిస్థాన్ కరోనా ప్రభావిత దేశాలను మూడు కేటగిరీలుగా విభజించింది. సి కేటగిరీలో ఉన్న దేశాల నుంచి వచ్చేవారిపై పాక్ కఠిన ఆంక్షలు విధిస్తోంది. వారిని ఎన్సీఓసీ మార్గదర్శకాలకు లోబడి అనుమతిస్తారు. డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువ రావడంతో మే 22 నుంచి ఆగస్టు 12 వరకు భారత్ ను పాకిస్థాన్ సి కేటగిరీలో ఉంచింది.