Ecolastic Covers: తిరుమల శ్రీవారి ప్రసాదం కోసం డీఆర్డీవో పర్యావరణ హిత సంచులు
- తిరుమలలో ఎకోలాస్టిక్ సంచులు
- విక్రయకేంద్రం ప్రారంభం
- రెండు సైజుల్లో అందుబాటు
- మూడు నెలల్లోనే భూమిలో కలిసిపోయే సంచులు
తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చాలని టీటీడీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత తిరుమల కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, దేశ రక్షణ రంగ అవసరాలు తీర్చే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తిరుమల క్షేత్రంలో ప్రసాదం కోసం ప్రత్యేకమైన సంచులు తయారుచేసింది.
బయో డీగ్రేడబుల్ కేటగిరీకి చెందిన ఈ సంచులు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. వీటిని ఎకోలాస్టిక్ సంచుల పేరిట డీఆర్డీవో రూపొందించింది. తాజాగా ఈ సంచుల విక్రయకేంద్రాన్ని తిరుమలలో టీటీడీ ఈవో జవహరెడ్డి, డీఆర్డీవో చైర్మన్ సతీశ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సంచుల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఇవి 3 నెలల్లోనే భూమిలో కలిసిపోతాయి. వీటిని పశువులు తిన్నప్పటికీ ఎలాంటి హాని ఉండదు. ఈ ఎకోలాస్టిక్ కవర్లను రెండు రకాలుగా అందుబాటులోకి తెచ్చారు. 5 లడ్డూలు పట్టే సంచి ధర రూ.2 కాగా.... 10 లడ్డూలు పట్టే సంచి ధరను 5 రూపాయలుగా నిర్ణయించారు.