Harish Rao: ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నిక
- సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానన్న హరీశ్
- కేసీఆర్ సహకారంతో ప్రపంచ గుర్తింపు వచ్చేలా చేద్దామని వ్యాఖ్య
- గతంలో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన ఈటల రాజేందర్
హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్ రావు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. మరోవైపు హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసిన ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఎగ్జిబిషన్ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. సొసైటీని ప్రగతిపథంలోకి తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. గత 80 ఏళ్లుగా ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ సహకారంతో నుమాయిష్ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామని చెప్పారు. సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా, వృత్తి నైపుణ్యాలు మెరుగుపడేలా చేద్దామని అన్నారు.
మరోవైపు గతంలో ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఈటల ఈజేందర్ ఉండేవారు. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఇతర పదవులకు కూడా ఆయన రాజీనామా చేశారు.