Afghanistan: ఎయిర్ పోర్టుకు ఆఫ్ఘన్ల పరుగులు.. బాష్పవాయువు ప్రయోగించిన సైన్యం.. వీడియోలివిగో!
- కాబూల్ ఎయిర్ పోర్ట్ కు వేలాది మంది
- గోడ ఎక్కి అవతలికి దూకేందుకు ప్రయత్నాలు
- రాత్రింబవళ్లు అక్కడే వేచి చూస్తున్న ప్రజలు
దేశాన్ని దాటే ఏ ఒక్క అవకాశాన్నీ ఆఫ్ఘన్లు వదిలిపెట్టడం లేదు. ఎవరు ఏది చెప్పినా నమ్మేసి ఎయిర్ పోర్టు వైపు పరుగులు తీస్తున్నారు. నిన్న అలాంటి ఓ పుకారునే నమ్మి కాబూల్ విమానాశ్రయం ముందు బారులు తీరారు. కాబూల్ ఎయిర్ పోర్టు లోపలికి ప్రవేశిస్తే చాలు.. అమెరికా సైన్యం అందరినీ కాపాడేస్తోందంటూ గుర్తు తెలియని వ్యక్తులు పుకార్లు లేపే సరికి వేలాది మంది అక్కడికి చేరుకున్నారు.
ఎయిర్ పోర్టులోకి ప్రవేశించేందుకు ఫెన్సింగ్ పెట్టిన గోడపైకి ఎక్కి నిల్చున్నారు. అవతలి వైపున్న అమెరికా, బ్రిటన్ సైనికులను అరిచి అరిచి పిలిచారు. తమను తీసుకెళ్లాలంటూ విజ్ఞప్తులు చేశారు. అయితే, పరిస్థితి చేయి దాటిపోకుండా అమెరికా సైన్యం బాష్పవాయుగోళాలను ప్రయోగించి, వారిని చెదరగొట్టింది. అయినా కూడా ప్రజలు తమను తీసుకెళ్తారన్న ఆశతో రాత్రింబవళ్లు అక్కడే వేచి చూస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.