Asteroid: భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. నేడు భూమికి సమీపానికి.. ప్రమాదం లేదన్న నాసా!
- ఈ గ్రహశకలం పేరు ‘2016 ఏజే193’
- 2063లో మళ్లీ భూమి సమీపానికి
- 5.9 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడిని చుట్టనున్న గ్రహశకలం
4500 అడుగుల వెడల్పు ఉన్న గ్రహశకలం ఒకటి గంటకు 94 వేల కిలోమీటర్ల వేగంతో భూమి దిశగా దూసుకొస్తోంది. నేడు అది భూమికి దగ్గరగా వచ్చి వెళ్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని ఊరటనిచ్చే ప్రకటన చేసింది.
ఈ గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చే సమయంలో భూమికి, దానికి మధ్య.. చంద్రుడికి, భూమికి మధ్యన ఉన్నంత దూరంతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువని పేర్కొంది. దీనిని ప్రమాదకరమైన అంతరిక్ష శిలగా అభివర్ణించిన నాసా.. దానికి ‘2016 ఏజే193’గా పేరు పెట్టింది. ఈ గ్రహశకలం మళ్లీ 2063లో భూమికి దగ్గరగా వస్తుందని తెలిపింది.
ఈ గ్రహ శకలాన్ని జనవరి 2016లో హవాయ్‌లోని పాన్-స్టార్స్ అబ్జర్వేటరీ సాయంతో గుర్తించారు. ఇది చాలా చీకటిగా ఉందని, దీని నుంచి కాంతి పరావర్తనం చెందడం లేదని దీనిని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు తెలిపారు. 5.9 ఏళ్లకోసారి ఇది సూర్యుడిని చుట్టి వస్తుందని వివరించారు.