Guntur District: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకయ్య కన్నుమూత
- గత కొన్ని రోజులుగా అనారోగ్యం
- ఎన్జీరంగా శిష్యుడిగా గుర్తింపు
- 1989 నుంచి 94 వరకు ఎమ్మెల్యేగా సేవలు
- సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన వైనం
గుంటూరు జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, తాటికొండ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యుడు అయిన తిరువాయిపాటి వెంకయ్య కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు.
ఆచార్య ఎన్జీరంగా శిష్యుడిగా గుర్తింపు పొందిన వెంకయ్య ఆయనతో కలిసి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. పొన్నూరు సమితి అధ్యక్షుడిగా, పురపాలక సంఘం చైర్మన్‌గా పనిచేశారు. 1989 నుంచి 94 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1991 నుంచి 94 వరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గానూ సేవలు అందించారు. ఏఐసీసీ సభ్యుడిగానూ కొనసాగిన వెంకయ్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేశారు.