G. Kishan Reddy: కేసీఆర్ మరికొన్నాళ్లు పాలిస్తే రాష్ట్రం దివాలా తీయడం ఖాయం: నిప్పులు చెరిగిన కిషన్‌రెడ్డి
- హుజూరాబాద్‌లో ఈటలను ఓడించే కుట్ర
- మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లోనే మాట్లాడతారు
- జన ఆశీర్వాద యాత్ర పేరుతో మలిదశ ఉద్యమం: బండి
- గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం
కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కిషన్‌రెడ్డి నిన్న కోదాడ, సూర్యాపేటలో జరిగిన జన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ మరికొన్నాళ్లపాటు పాలిస్తే రాష్ట్రం దివాలా తీయడం ఖాయమన్నారు. హుజూరాబాద్‌లో ఈటలను ఓడించేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని నొక్కి చెప్పారు. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి.. హైదరాబాద్‌లో ఉన్న ఓ మంత్రి ట్విట్టర్‌లో తప్ప మరెక్కడా మాట్లాడరని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో తీవ్రవాదం చాలా వరకు తగ్గిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 45 వ్యాక్సిన్లు తయారవుతుంటే అందులో రెండు దేశంలో తయారవుతున్నాయని, వాటిలో ఒకటి తెలంగాణలో తయారైందని అన్నారు.
ఇదే సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతమొందించేందుకే బీజేపీ జన ఆశీర్వాద యాత్ర పేరుతో మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించిందన్నారు. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగురవేస్తామన్నారు.