Chidambaram: కేంద్ర ప్రభుత్వం ఈ పని చేస్తే లీటర్ పెట్రోల్ రూ. 32కే లభిస్తుంది: చిదంబరం
- వివిధ సందర్భాల్లో వేసిన సెస్ ను తొలగించాలి
- సెస్ అనేది పన్ను కాదనే విషయాన్ని గుర్తించాలి
- పెద్ద నోట్ల రద్దు మంచి ఆలోచనే
పెట్రోల్ పై విధిస్తున్న సెస్ ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దాని ధర భారీగా తగ్గుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం సొమ్ము వసూలు చేస్తోందని అన్నారు. సెస్ అనేది పన్ను కాదనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. వివిధ సమయాల్లో వేసిన సెస్ లను తొలగించకుండా, కేంద్రం అలాగే కొనసాగిస్తోందని, అందుకే పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. ఆయా సమయాల్లో వేసిన సెస్ లను తొలగిస్తే లీటర్ పెట్రోల్ రూ. 32కే అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
పెద్ద నోట్ల రద్దుపై చిదంబరం మాట్లాడుతూ... నోట్లు రద్దు చేయాలనే మోదీ ఆలోచన మంచిదేనని అభిప్రాయపడ్డారు. అయితే, అమలులో కొంత వైఫల్యం చెందారని చెప్పారు. నల్లధనాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో నోట్ల రద్దును చేపట్టారని... అయితే నల్లధనం ఉన్నవారు వారి డబ్బును వివిధ రకాలుగా వైట్ గా మార్చుకున్నారని అన్నారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావుతో తనకు మంచి అనుబంధం ఉందని... ఒకసారి తాను రూపొందించిన ముసాయిదా చట్టం ఫైలును కనీసం చదవకుండానే సంతకం పెట్టారని గుర్తు చేసుకున్నారు.