Jammu And Kashmir: కశ్మీర్ ప్రత్యేక దేశమట.. సిద్ధూ సలహాదారు వివాదాస్పద వ్యాఖ్యలు
- భారత్, పాక్ ఆక్రమించాయని కామెంట్లు
- మండిపడిన బీజేపీ, శిరోమణి అకాలీదళ్
- అమరులను అవమానించడమేనని విమర్శలు
కశ్మీర్ ప్రత్యేక దేశమట.. భారత్, పాకిస్థాన్ రెండూ అందులోకి అక్రమంగా చొరబడ్డాయట.. అవును, ఈ వ్యాఖ్యలు చేసింది కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సలహాదారు మల్వీందర్ సింగ్ మాలి. కశ్మీర్ ప్రజలకే అది సొంతమని, భారత్, పాకిస్థాన్ లు దానిని ఆక్రమించాయని అన్నారు.
ఆయన చేసిన ట్వీట్ పై అన్ని పార్టీల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు కశ్మీర్ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరులను అవమానించేలా ఉన్నాయని శిరోమణి అకాలీదళ్ నేత బిక్రమ్ మజీథియా అన్నారు. దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మాలి వ్యాఖ్యలను రాహుల్ సమర్థిస్తే కాంగ్రెస్ అసలు రూపం బయటపడినట్టేనని విమర్శించారు.
సిద్ధూ అస్థిర రాజకీయ నాయకుడని బీజేపీ నేత వినీత్ జోషి మండిపడ్డారు. పాకిస్థానీ ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడేందుకు ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని, ఈ వ్యాఖ్యలతో వారందరినీ అవమానించారని అన్నారు. మాలిని సలహాదారుగా నియమించుకుని తన ఉద్దేశమేంటో సిద్ధూ చాటారని చెప్పారు. పాకిస్థాన్ అంటే సిద్ధూకు ఎక్కడలేని ప్రేమ ఉందని మండిపడ్డారు.
ఇటు సొంత పార్టీ నుంచీ విమర్శలు మొదలయ్యాయి. మాటలను హద్దుల్లో పెట్టుకోవాలంటూ కెప్టెన్ అమరీందర్ వర్గం చురకలంటించింది. కాగా, అంతకుముందు మాలి మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలు కలిసి పంజాబ్ లో మతకలహాలను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నారంటూ వ్యాఖ్యానించారు.