America: అదుపులోకి వచ్చినట్టే వచ్చి.. అమెరికాలో మళ్లీ చెలరేగుతున్న కరోనా!
- రోజుకు వెయ్యి దాటిన మరణాలు
- గంటకు 42 మంది వరకు మృతి
- వ్యాక్సిన్ తీసుకోకుంటే ప్రమాదం అంచున ఉన్నట్టేనన్న అధికారులు
అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగిపోతోంది. అదుపులోకి వచ్చినట్టే వచ్చిన వైరస్ మళ్లీ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. ప్రతి రోజూ గంటకు 42 మంది వరకు చనిపోతుండగా రోజుకు వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తున్నాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత అమెరికాలో కరోనా వైరస్ దాదాపు అదుపులోకి వచ్చినట్టే కనిపించింది. కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడంతో నిబంధనలు కూడా సడలించారు.
అయితే, ఇంతలోనే డెల్టా వేరియంట్ వంటి కొత్త రకాల వల్ల తాజాగా అక్కడ కేసులు మళ్లీ పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. గత నెల రోజులుగా వీటి సంఖ్య మరింత పెరిగింది. రోజుకు సగటున 769 మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం ఒక్క రోజే దేశంలో 1017 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తాజా మరణాలతో కలుపుకుని అమెరికాలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 6.22 లక్షలకు చేరుకుంది.
మరోవైపు, కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆసుపత్రులు మళ్లీ కిటకిటలాడుతున్నాయి. గత రెండు వారాల్లో ఆసుపత్రిలో చేరికలు 70 శాతం పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మున్ముందు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్).. వ్యాక్సిన్ తీసుకోని వారు ప్రమాదం అంచున ఉన్నట్టేనని హెచ్చరించింది.