Afghanistan: ఆఫ్ఘన్ గడ్డ మీద నుంచి ఏ దేశానికీ హాని జరగదు: హామీ ఇచ్చిన తాలిబన్లు

No country will be harmed from Afghan soil Taliban guaranteed

  • ప్రపంచ దేశాలకు ఇస్లామిక్ ఎమిరేట్స్ హామీ
  • మంగళవారం నాడు తాలిబన్ల మొదటి మీడియా సమావేశం
  • నాయకుడి ఆజ్ఞల మేరకు అందర్నీ క్షమించేశామన్న ప్రతినిధి
  • ఎవరూ భయపడాల్సిన పనిలేదంటూ ధైర్యం
  • మహిళల హక్కులను గౌరవిస్తామని హామీ

అమెరికా సైన్యం వెళ్లిపోయిన పదిరోజుల్లో ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. తాలిబన్ దళాలు ఆ దేశాన్ని మెరుపు వేగంతో తమ వశం చేసుకున్నాయి. ఈ క్రమంలో భయంతో వణికిపోయిన ప్రజలు ఆఫ్ఘనిస్థాన్ ను వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇంతటి అలజడులు దేశవ్యాప్తంగా జరుగుతుండగా.. తాలిబన్లు తమ మొట్టమొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన తాలిబన్ ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్ గడ్డ మీద నుంచి ప్రపంచంలోని ఏ దేశానికీ ఎటువంటి హానీ జరగదని, ఈ విషయంలో ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రపంచానికి వాగ్దానం చేస్తోందని జబీబుల్లా తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఇస్లామిక్ ఎమిరేట్స్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాలిబన్ సైన్యాలు అధికారికంగా ఆఫ్ఘనిస్థాన్ పాలనను ఇంకా తీసుకోలేదు. దీంతో ఇస్లామిక్ ఎమిరేట్స్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు.

అందరూ కలిసి ఉండే ప్రభుత్వాన్నే తాము ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జబీబుల్లా చెప్పారు. దేశంలో కానీ, దేశం బయట కానీ తమకు శత్రువులు వుండరని చెప్పిన ఆయన.. తమకు ఎవరిపైనా శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. తమ నాయకుల ఆదేశాల మేరకు అందర్నీ తాము క్షమించామని చెప్పారు. ఎవరి మీదా ప్రతీకారం తీర్చుకోవడం జరగదని హామీ ఇచ్చిన ఆయన.. పాశ్చాత్య దళాలతో పనిచేసిన మాజీ మిలటరీ అధికారులపై కూడా ఎటువంటి చర్యలూ ఉండబోవని స్పష్టంచేశారు. ‘ఎవరూ వచ్చి మీ ఇళ్లు తనిఖీ చేయరు’ అని ప్రకటించారు.

అలాగే ఆఫ్ఘన్ ప్రజల విలువలకు అనుగుణంగా చట్టాలు చేసుకునే అధికారం తమకుందని, ప్రపంచ దేశాలు కూడా వాటిని గౌరవించాలని జబీబుల్లా కోరారు. మహిళలపై కూడా ఎలాంటి వివక్ష చూపడం జరగదని చెప్పిన ఆయన.. ఇస్లాం ఆధారంగా మహిళలకు హక్కులు కల్పిస్తామని చెప్పారు. అవసరమైన రంగాల్లో మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News