Afghanistan: ప్రధాని మోదీ అధ్యక్షతన జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ భేటీ... ఆఫ్ఘన్ అంశమే ప్రధాన అజెండా

PM Modi Natioanal Security affairs committee meeting

  • ఆఫ్ఘన్ లో సంక్షోభం
  • రాజధాని కాబూల్ సహా యావత్ దేశం తాలిబన్ల వశం
  • తరలిపోతున్న విదేశీయులు, దౌత్యసిబ్బంది
  • తాజా పరిస్థితులపై చర్చించనున్న కేంద్రం

రెండు దశాబ్దాల అనంతరం ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ జెండా ఎగురుతోంది. గతంలో తాలిబన్ల దుశ్చర్యలను గుర్తుచేసుకుంటూ, విదేశీయులే కాదు ఆఫ్ఘన్లు కూడా దేశాన్ని వీడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు తమ పౌరులను, దౌత్యసిబ్బందిని ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నాయి. కాగా, ఆఫ్ఘన్ లో పరిణామాలపై చర్చించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జాతీయ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశమైంది.

ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ, రక్షణ శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. ఆఫ్ఘన్ లో తాలిబన్లు అధికారం చేపట్టడంపై ఎటువంటి వైఖరి వెలిబుచ్చాలన్నది ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం ఆఫ్ఘన్ పరిణామాలపై కేంద్రం నుంచి ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

అటు, కాబూల్ నుంచి రాయబార కార్యాలయ సిబ్బంది తరలింపు పూర్తయిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాయబార కార్యాలయ సిబ్బంది మధ్యాహ్నం భారత్ కు చేరుకున్నారని తెలిపింది. ఆఫ్ఘన్ నుంచి భారతీయులందరినీ కేంద్రం తరలిస్తుందని స్పష్టం చేసింది. కాబూల్ విమానాశ్రయం తెరిచాక భారతీయులను తరలిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News