Sabarimala: శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు.. 9 ఏళ్ల బాలికకు అనుమతినిచ్చిన హైకోర్టు
- 10 సంవత్సరాలు నిండేలోపు గుడికి వెళ్లాలని బాలిక కోరిక
- ఇప్పుడు కాకపోతే మరో నలభై ఏళ్ల వరకు అవకాశం రాదన్న బాలిక
- తండ్రితో కలిసి వెళ్లేందుకు సిద్ధం
- ఆగస్టు 23న ఆలయానికి వెళ్లనున్న తండ్రి
శబరిమల దేవాలయానికి తండ్రితోపాటు వెళ్లడానికి అనుమతి కోరుతూ ఒక 9 ఏళ్ల బాలిక కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ బాలికను ఆలయంలోకి అనుమతించాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా బాలిక తరఫు న్యాయవాది వాదిస్తూ.. సదరు బాలిక 10 ఏళ్లు నిండేలోపు ఆలయం చూడాలని కోరుకుంటోందని చెప్పారు. ఈ అవకాశం పోతే ఆమె మళ్లీ ఆలయం చూడాలంటే మరో నలభై ఏళ్ల వరకూ ఆమెకు అవకాశం దక్కదని ఆయన వాదించారు.
ఈ వాదనలు విన్న కేరళ హైకోర్టు ఆగస్టు 23న సదరు బాలికను తండ్రితోపాటు ఆలయంలోకి అనుమతించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ నెలలో కూడా కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న పెద్దలు పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ పిల్లలను అనుమతించాలని అప్పట్లో చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక తీర్మానం చేసింది.
ఏటా నిర్వహించే నిరపుతారి వేడుక కోసం అయ్యప్ప ఆలయ ద్వారాలు ఆగస్టు 15న తెరుచుకున్నాయి. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని రోజుకు 15 వేల మంది భక్తులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఆ సంఖ్య పూర్తయిన వెంటనే ఆలయాన్ని మూసివేస్తున్నారు. ఆగస్టు 23 సాయంత్రం ఈ పూజలు పూర్తయిపోతాయి.