Revanth Reddy: తెలంగాణ ఉద్యమంలో దళితులను పావులుగా వాడుకున్నారు: సీఎం కేసీఆర్ పై రేవంత్ విమర్శనాస్త్రాలు
- ఇవాళ దళితబంధు ప్రారంభం
- హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ ప్రసంగం
- తీవ్రస్థాయిలో స్పందించిన రేవంత్
- కేసీఆర్ కు ఇదే ఆఖరి ప్రసంగం అని వ్యాఖ్యలు
హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ ఇవాళ దళితబంధు పథకం ప్రారంభించడంపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. దళితులను తెలంగాణ ఉద్యమంలో పావులుగా వాడుకున్నారని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి మాట తప్పారని, నెక్లెస్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్క తట్ట మట్టి కూడా తవ్వలేదని వ్యాఖ్యానించారు. ఇవాళ దళితబంధు సభలోనూ కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెప్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
దళితులకు అన్యాయం చేసినవాళ్లలో మొదటి దోషి కేసీఆరేనని అన్నారు. ఒక్క అసెంబ్లీ స్థానం (హుజూరాబాద్) గెలవడానికి ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా దిగజారిపోయారని విమర్శించారు. హుజూరాబాద్ లో గెలుపు కోసం ఆఖరికి శోభమ్మను కూడా రంగంలోకి దింపారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా కేసీఆర్ కు దళిత బంధు సభనే చివరిదని స్పష్టం చేశారు.
త్వరలోనే హుజూరాబాద్ లో తుపాను రాబోతోందని, అందులో కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో దళిత-గిరిజన సభ తర్వాత కాంగ్రెస్ తదుపరి లక్ష్యం హుజూరాబాదేనని అన్నారు. కేసీఆర్ సభ జరిపిన ప్రదేశంలోనే కాంగ్రెస్ సభ ఏర్పాటు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.