Heart Attack: సాలీడు విషాన్ని ఇలా కూడా ఉపయోగించవచ్చు: ఆస్ట్రేలియా పరిశోధకులు
- గుండెపోటు చికిత్సకు సాలీడు విషం
- సాలీడు విషంలో హెచ్ఐ1ఏ ప్రొటీన్
- ప్రొటీన్ తో ఔషధం తయారీ
- గుండె కణాలను బాగుచేసే ప్రొటీన్
కొన్ని రకాల సాలీళ్లు విషపూరితాలు అని తెలిసిందే. వీటికి సంబంధించి ఆస్ట్రేలియా పరిశోధకులు ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. గుండెజబ్బుల చికిత్సలో సాలీళ్ల విషం మెరుగైన ఫలితాలు ఇస్తోందని గుర్తించారు. సాలీడు విషంలో ఉండే హెచ్ఐ1ఏ అనే ప్రత్యేకమైన ప్రొటీన్ బలహీనంగా ఉన్న గుండె కణాలకు మరమ్మతులు చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రొటీన్ నుంచి ఔషధాన్ని తయారుచేసి, గుండెపోటుకు గురైనవారికి అత్యవసర స్థితిలో చికిత్స చేయడంపై అధ్యయనం చేపట్టారు.
క్వీన్స్ లాండ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నాథన్ పాల్పంత్, విక్టర్ చెంగ్ కార్డియాక్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన ఫ్రొఫెసర్ గ్లెన్ కింగ్, ప్రొఫెసర్ పీటర్ మెక్ డొనాల్డ్ ఈ పరిశోధనలో భాగస్వాములు. గుండెపోటుకు గురైన రోగికి తక్షణమే చికిత్స అందించాల్సి ఉంటుందని, అలాంటి సమయాల్లో ఈ ప్రొటీన్ తో తయారైన ఔషధాన్ని అంబులెన్స్ లోనే ఇవ్వొచ్చని, తద్వారా ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు.
గ్రామాల్లో ఉండే ప్రజలు గుండెపోటుకు గురైన సమయంలో వారు పెద్ద ఆసుపత్రులకు వెళ్లేందుకు అధిక సమయం పడుతుందని, అలాంటివారికి ఇది ప్రాణాధార ఔషధం అవుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన వ్యక్తులకు కూడా ఈ మందు బాగా ఉపయోగపడుతుందని వివరించారు.
అయితే, ఈ హెచ్ఐ1ఏ ప్రొటీన్ కేవలం ఫ్రేజర్ ఐలాండ్ ఫన్నెల్ బేబ్ అనే సాలీడు విషంలో మాత్రమే ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. దీనికి సంబంధించిన అధ్యయనం 'సర్క్యులేషన్' అనే పత్రికలో ప్రచురితమైంది.