Afghanistan: ఆఫ్ఘన్​ మొత్తం తాలిబన్​ వశం!.. కాబూల్​ లోకి ఎంటరైపోయిన తాలిబన్లు, తుపాకుల మోతలు

Talibans Enter Kabul Heavy Gun Fight Continues

  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అధ్యక్ష రాజభవనం
  • ప్రస్తుతం సైన్యం కంట్రోల్ లోనే ఉందని కామెంట్
  • రాయబారులను తరలించేసిన అమెరికా
  • కాబూల్ లోనే యూరోపియన్ యూనియన్ సిబ్బంది
  • సురక్షితమైన రహస్య స్థావరాల్లో ఉంచినట్టు వెల్లడి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోకి తాలిబన్లు ఎంటరైపోయారు. నిన్న ఆ నగరానికి అతి సమీపంలోకి వచ్చేసిన ఉగ్రవాదులు.. ఒక్కరోజులోనే నగరం లోపలికి చొచ్చుకొచ్చేశారు. ఈ విషయాన్ని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నగరం నలుమూలల నుంచి తాలిబన్ ఉగ్రవాదులు చొరబడిపోతున్నారని అన్నారు.

నగరంలోని చాలా ప్రాంతాల్లో తుపాకుల మోత మోగుతోందని ఆఫ్ఘన్ అధ్యక్ష భవనం తన అధికారిక ట్విట్టర్ ఖాతా లో ట్వీట్ చేసింది. అంతర్జాతీయ మిత్రులతో కలిసి తాలిబన్లను ఆఫ్ఘన్ సైన్యం నిరోధిస్తోందని, ప్రస్తుతం కాబూల్ సైన్యం నియంత్రణలోనే ఉందని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయినట్టేనని చెబుతున్నారు.

కాగా, ఇటు అమెరికా తన రాయబారులను అక్కడి నుంచి హెలికాప్టర్ లో తరలించింది. వజీర్ అక్బర్ ఖాన్ జిల్లాలోని ఎంబసీ అధికారులను విమానాశ్రయానికి తీసుకెళ్లామని అమెరికా అధికారులు తెలిపారు. యూరోపియన్ యూనియన్ సిబ్బందిని కాబూల్ లోని అత్యంత సురక్షితమైన రహస్య ప్రాంతానికి తరలించామని నాటో అధికారి చెప్పారు.

వీలైనంత త్వరగా అమెరికన్లను కాపాడి తీసుకొచ్చేందుకు 5 వేల మంది బలగాలను ఆఫ్ఘనిస్థాన్ కు పంపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలిచ్చారు. 82వ ఎయిర్ బార్న్ కు చెందిన వెయ్యి మంది బలగాలను అదనంగా పంపిస్తున్నట్టు ఆ దేశ రక్షణ శాఖ అధికారి చెప్పారు. తమకూ ఎవరినీ చంపాలని లేదని, అయితే, తాము మాత్రం కాల్పులను విరమించబోమని తాలిబన్ ప్రతినిధి చెప్పాడు. మరోవైపు జలాలాబాద్ గవర్నర్ లొంగిపోవడంతో అక్కడ ప్రస్తుతం ఎలాంటి గొడవలు జరగట్లేదని అధికారులు చెబుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News