Neeraj Chopra: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఒలింపిక్ పసిడి విజేత నీరజ్ చోప్రా
- టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా
- గత రెండ్రోజులుగా జ్వరం
- నిన్న 103 డిగ్రీల జ్వరం
- హర్యానా ప్రభుత్వ సన్మానానికి గైర్హాజరు
టోక్యో ఒలింపిక్స్ లో పసిడి పతకం గెలిచి జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అనారోగ్యానికి గురయ్యాడు. హర్యానాకు చెందిన నీరజ్ చోప్రా గత రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే వైద్యుల సలహాపై కరోనా టెస్టు చేయించుకోగా, అందులో చోప్రాకు నెగెటివ్ రావడం ఊరటనిచ్చే విషయం. శుక్రవారం హర్యానా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన సభకు కూడా ఈ పసిడి వీరుడు హాజరు కాలేదు.
చోప్రా ప్రస్తుతం కోలుకుంటున్నాడని అతడి సన్నిహితుడొకరు మీడియాకు తెలిపారు. నిన్న చోప్రాకు 103 డిగ్రీల తీవ్రతతో జ్వరం వచ్చిందని, ఇవాళ అతడి పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉందని వివరించారు. భారత్ వచ్చినప్పటినుంచి ఊపిరి సలపనంతగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని, ఈ కారణంగానే అనారోగ్యానికి గురైనట్టు భావిస్తున్నామని పేర్కొన్నారు. వైద్యుల సలహాతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడని ఆ సన్నిహితుడు వెల్లడించారు. అయితే ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమానికి నేరుగా వస్తాడని, మిగతా అథ్లెట్లు అశోకా హోటల్ నుంచి వస్తారని తెలిపారు.