NHRC: విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి చర్యలేవీ?: తెలుగు రాష్ట్రాలపై మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం

NHRC gets anger on Telugu states over students suicides

  • తెలుగు రాష్ట్రాల్లో 426 మంది విద్యార్థుల ఆత్మహత్య
  • నివేదిక ఇవ్వాలన్న ఎన్ హెచ్చార్సీ
  • గతేడాది సీఎస్ లకు ఆదేశం
  • సరైన రీతిలో స్పందించకపోవడంపై అసంతృప్తి

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వెలిబుచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో శాస్త్రీయంగా చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించింది. ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలు సరిపోవని స్పష్టం చేసింది.

2019 నివేదికల ప్రకారం 426 మంది విద్యార్థులు బలవన్మరణం చెందినట్టు వివరించింది. తెలంగాణలో వారం రోజుల వ్యవధిలోనే 22 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపింది. ఏపీలో 383 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఎన్ హెచ్చార్సీ పేర్కొంది.

కాగా, విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్ హెచ్చార్సీ ఉభయ రాష్ట్రాల విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక కోరింది. గతేడాది డిసెంబరులో ఇరు రాష్ట్రాల సీఎస్ లకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే, ఆత్మహత్యల కట్టడికి తీసుకున్న శాస్త్రీయ చర్యలు చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కమిషన్ తాజాగా మరోసారి ఆదేశించింది. నివేదిక ఇవ్వకపోతే తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

  • Loading...

More Telugu News