Karnataka: కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకునే దిశగా కర్ణాటక ప్రభుత్వం
- కర్ణాటకలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
- ఆగస్టు 15 తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామన్న రెవెన్యూ మంత్రి అశోక్
- బెంగళూరు సహా ఇతర జిల్లాల్లో ఆంక్షలు విధిస్తామని వ్యాఖ్య
కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్ర రాజధాని బెంగళూరుపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయనే భయాందోళనలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు మళ్లీ చర్యలు తీసుకునేందుకు కర్ణాటక సర్కార్ సిద్ధమవుతోంది. ఆగస్టు 15 తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి అశోక్ తెలిపారు.
కేరళ, మహారాష్ట్రల నుంచి కరోనా వ్యాపించకుండా ఉండేందుకు బెంగళూరు సహా ఇతర జిల్లాల్లో ఆంక్షలు విధిస్తామని అశోక్ చెప్పారు. బెంగళూరులో పిల్లల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి బొమ్మై నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. పిల్లలకు కరోనా చికిత్స అందించేందుకు వీలుగా పీడియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేస్తామని అన్నారు.
కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్లు, కర్ఫ్యూలు ఒక్కటే కొలమానం కాదని... రోగులకు ఔషధాలను ఇవ్వడం ద్వారా కూడా కరోనాను కట్టడి చేయవచ్చని చెప్పారు. ఇప్పుడు వరుసగా పండుగలు వస్తున్నాయని... పండుగల సందర్భంగా కరోనా వ్యాప్తి చెందకుండా ఆంక్షలు విధిస్తామని తెలిపారు. భక్తులను దేవాలయాల్లోకి అనుమతించకపోవడం, కార్యక్రమాలు, ఈవెంట్ లు, వివాహాల్లో ఎక్కువ మంది ప్రజలు పాల్గొనకుండా పరిమితులు విధించడం, రాత్రి కర్ఫ్యూలు విధించడం వంటి పనులు చేస్తామని చెప్పారు.