Bhimavaram: రైల్వేగేటు సమీపంలో భారీ పేలుడు.. ఉలిక్కిపడిన భీమవరం

Bomb blast in Bhimavaram

  • నేడు భీమవరంలో పర్యటించనున్న సీఎం జగన్
  • వేదిక సమీపంలోనే పేలుడు..ఆవుకు గాయాలు
  • భయంతో హడలిపోయిన జనం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న వేళ నిన్న పట్టణంలో పేలుడు సంభవించడం కలకలం రేపింది. సాయంత్రం సమయంలో ఉండి రైల్వే గేటు సమీపంలో భారీ శబ్దంతో పేలుడు జరిగింది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ముఖ్యమంత్రి రేపు హాజరయ్యే కార్యక్రమ వేదిక సమీపంలోనే పేలుడు సంభవించడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. బాంబ్ స్క్వాడ్ బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించాయి.

పేలుడు జరిగిన ప్రాంతంలో గుంత ఏర్పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ గోవు కాలిభాగం పూర్తిగా దెబ్బతింది. దాని పొట్టకు కూడా గాయాలయ్యాయి. పేలుడుకు స్పష్టమైన కారణం రాత్రి వరకు తెలియరాలేదు. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో పాత ఇనుప సామగ్రి దుకాణం ఉంది. పాత ఫ్రిజ్‌లు, ఏసీలలోని కంప్రెషర్ భాగాలు భూమిలో కూరుకుపోయి ఉంటాయని, ఆవు వాటిపై కాలు వేసినప్పుడు ఒత్తిడికి అవి పేలి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. అలాగే, బాణసంచా, నాటు బాంబు వంటి వాటిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

Bhimavaram
West Godavari District
Bomb Blast
  • Loading...

More Telugu News