Telangana: కృష్ణా బోర్డుకు తెలంగాణ మరో లేఖ
- ఏపీ అక్రమ నీటి తరలింపును ఆపాలని విజ్ఞప్తి
- మచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల నుంచి నీటిని తరలిస్తోందని ఫిర్యాదు
- కేసీ కెనాల్ కు తుంగభద్ర నుంచే నీళ్లిస్తున్నారని వెల్లడి
మచ్చుమర్రి ఎత్తిపోతల, మల్యాల పంపింగ్ స్టేషన్, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి ఏపీ నీటి తరలింపును ఆపాల్సిందిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఆ మూడింటి నుంచి కేసీ కెనాల్ కు అక్రమంగా నీటిని తరలిస్తున్నారని పేర్కొంది.
ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోతోందని, దానిని ఎలాగైనా ఆపాలని విజ్ఞప్తి చేస్తూ కేఆర్ఎంబీ చైర్మన్ రాయ్ పురేకి ఈఎన్సీ మురళీధర్ రావు లేఖ రాశారు. అనుమతులు తీసుకోకుండానే ప్రాజెక్టులను కడుతున్నారని, వాటి నుంచి నీటి తరలింపును అడ్డుకోవాలని ఆ లేఖలో కోరారు. కేసీ కెనాల్ కు తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేస్తున్నారని, అలాంటప్పుడు ఆ మూడింటి ద్వారా నీటిని తరలించడం ఎందుకని లేఖలో ప్రశ్నించింది.