Pegasus: పెగాసస్ సృష్టికర్తలతో ఎలాంటి లావాదేవీలు జరపలేదు: పార్లమెంటులో స్పష్టం చేసిన కేంద్రం

Centre said no transactions with Pegasus makers

  • దేశంలో పెగాసస్ కలకలం
  • సంచలన కథనం వెలువరించిన గ్లోబల్ కన్సార్టియం
  • ప్రభుత్వం నుంచి వివరణ కోరుతున్న విపక్షాలు
  • తాము అక్రమ నిఘా వేయడంలేదన్న కేంద్రం

పెగాసస్ స్పైవేర్ అంశం పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అట్టుడికిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వివరణ ఇచ్చింది. పెగాసస్ సృష్టికర్త ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ తో ఎలాంటి లావాదేవీలు జరపలేదని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు స్పష్టం చేసింది. సీపీఎం ఎంపీ డాక్టర్ వి.శివదాసన్ అడిగిన ఓ ప్రశ్నకు రక్షణ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తాము ఎవరిపైనా అక్రమంగా నిఘా వేయడంలేదని స్పష్టం చేశారు.

అయితే కేంద్రం వివరణపై విపక్షాలు అసంతృప్తి వెలిబుచ్చాయి. సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణిలో వివరణ ఇస్తోందంటూ మండిపడ్డాయి. భారత్ లోని రాజకీయనేతలు, పాత్రికేయులు, ఇతర ప్రముఖులపై పెగాసస్ స్పైవేర్ తో నిఘా వేస్తున్నారంటూ ఓ ప్రపంచ మీడియా వేదిక సంచలన కథనం వెలువరించింది. దాంతో భారత్ లో తీవ్ర కలకలం రేగింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. స్వతంత్ర దర్యాప్తు జరిపించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి.

కాగా, ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ ఇచ్చిన వివరణ కేంద్రాన్ని ఇరకాటంలో పడేసింది. తాము ఈ సాఫ్ట్ వేర్ ను వ్యక్తులకు కాకుండా కేవలం కొన్ని దేశాల ప్రభుత్వాలకు, వారి సంస్థలకు మాత్రమే విక్రయిస్తామని ఎన్ఎస్ఓ వెల్లడించింది. దాంతో, భారత కేంద్ర ప్రభుత్వానికి కూడా పెగాసస్ ను విక్రయించి ఉంటారన్న వాదనలు తెరపైకి వచ్చాయి.

Pegasus
NSO Group
Israel
India
Parliament
  • Loading...

More Telugu News