Postal Ballot: ఏపీలో తపాలా ఓట్లపై కలకలం రేపుతున్న హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యలు
- తనతోపాటు మరో ఆరుగురం కలిసి 700కుపైగా తపాలా ఓట్ల వివరాలు సేకరించామన్న కానిస్టేబుల్
- వారం రోజుల క్రితం వ్యాఖ్యలు, తాజాగా వైరల్
- వెంకటరెడ్డిని వీఆర్‌కు పంపిన జిల్లా ఎస్పీ
పోలీసు శాఖలోని కొందరి సహకారంతో తపాలా ఓట్ల వివరాలను సేకరించి ఓ పార్టీకి ఇచ్చామంటూ ప్రకాశం జిల్లాకు చెందిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నర్రా వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
వారం రోజుల క్రితం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి, ఇతర అధికారుల సమక్షంలో ఆయనీ వ్యాఖ్యలు చేయగా తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎంపిక చేసిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులతో జులై 30న ఒంగోలులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో అధికార పార్టీకి సహకరించిన కొందరు అధికారులు, సిబ్బంది కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనికి ప్రణీత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో తనతోపాటు మల్లారెడ్డి, కోటిరెడ్డి, సుబ్బారావు, వేణు, హోంగార్డు కిషోర్, ఓ మహిళా కానిస్టేబుల్ కలిసి జిల్లా వ్యాప్తంగా 700కుపైగా పోస్టల్ బ్యాలెట్ల వివరాలు సేకరించి పార్టీకి ఇచ్చామని, తమ కృషిని గుర్తించి మేలు చేయాలని కోరారు.
అంతేకాక, గత ప్రభుత్వంలో ఉన్న వారే ఇప్పటికీ కీలక పదవుల్లో ఉన్నారని పేర్కొన్న వెంకటరెడ్డి.. ఈ విషయాన్ని మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని, మీరైనా న్యాయం చేయాలని ప్రణీత్‌రెడ్డిని కోరారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో స్పందించిన జిల్లా ఎస్పీ మలికా గార్గ్ అతడిని వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)కు పంపుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.