Anand Mahindra: నీరజ్ చోప్రాకు మహీంద్రా ఎక్స్ యూవీ-700ను బహూకరించనున్న ఆనంద్ మహీంద్రా

Anand Mahindra announces XUV vehicle for Neeraj Chopra

  • భారత్ లో మార్మోగుతున్న నీరజ్ చోప్రా పేరు
  • టోక్యో ఒలింపిక్స్ లో పసిడి కైవసం
  • బ్రహ్మరథం పడుతున్న ప్రజలు, ప్రభుత్వాలు, కంపెనీలు
  • కారు సిద్ధం చేయాలంటూ అధికారులకు మహీంద్రా ఆదేశం

భారత అథ్లెటిక్స్ రంగంలో హర్యానా కుర్రాడు నీరజ్ చోప్రా ఇప్పుడో సరికొత్త సంచలనం. టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో స్వర్ణం సాధించడమే కాకుండా, ఒలింపిక్ చరిత్రలోనే అథ్లెటిక్స్ లో దేశానికి తొలి పసిడి పతకం అందించాడు. దాంతో ఈ ఆర్మీ మ్యాన్ పై నజరానాల వర్షం కురుస్తోంది. తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తమ కంపెనీ తయారు చేసిన వాహనాన్ని నీరజ్ చోప్రాకు బహూకరించనున్నట్టు తెలిపారు.

చోప్రా టోక్యోలో బంగారు పతకం గెలిచిన తర్వాత ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశారు. ఓవైపున టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ బాహుబలి చిత్రంలో ఈటెను పట్టుకుని గుర్రంపై వస్తున్న ఫొటో, మరో పక్కన జావెలిన్ త్రో విసురుతున్న నీరజ్ చోప్రా ఫొటోను ఆయన పంచుకున్నారు. నీరజ్ చోప్రాను బాహుబలిగా అభివర్ణించారు. మేమంతా నీ సైన్యంలో ఉన్నాం అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ కు ఓ నెటిజన్ స్పందిస్తూ, నీరజ్ చోప్రాకు మహీంద్రా ఎక్స్ యూవీ-700 వాహనం కానుకగా అందించాలని సూచించాడు. అందుకు వెంటనే స్పందించిన ఆనంద్ మహీంద్రా... ఎక్స్ యూవీ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలంటూ తన సంస్థ ఉద్యోగులను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

కాగా, నీరజ్ చోప్రా జీవనశైలి గమనిస్తే దాదాపు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లైఫ్ స్టయిల్ ను తలపిస్తుంది. ధోనీ కూడా మొదట్లో జులపాల జుట్టును బాగా ఇష్టపడేవాడు. చోప్రా హెయిర్ స్టయిల్ కూడా అదే. పైగా ధోనీ లాగానే చోప్రాకు కూడా బైక్ లంటే పిచ్చి. చోప్రా గ్యారేజిలో పల్సర్ 220ఎఫ్ నుంచి హార్లే డేవిడ్సన్ 1200 రోడ్ స్టర్ వంటి ఆధునికతరం బైకులు కూడా ఉన్నాయి. కాగా నీరజ్ చోప్రా వద్ద ఉన్న బైకులపై జావెలిన్ త్రో విసురుతున్న అథ్లెట్ బొమ్మ ఉంటుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News