Sensex: వరుస లాభాలకు బ్రేక్.. నష్టాలలో ముగిసిన మార్కెట్లు
- రిలయన్స్ కు వ్యతిరేకంగా సుప్రీం తీర్పు
- అమ్మకాల ఒత్తిడికి గురైన రిలయన్స్ షేర్లు
- సెన్సెక్స్ కు 215.12 పాయింట్ల నష్టం
- నిఫ్టీకి 56.40 పాయింట్ల నష్టం
దేశీయ స్టాక్ మార్కెట్లలో గత మూడు రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్ పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు ఫైనాన్సియల్ సర్వీసెస్ కు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో మార్కెట్లు ఈ వేళ నష్టాలను నమోదు చేశాయి. ముఖ్యంగా రిలయన్స్ లో ఫ్యూచర్ గ్రూపు విలీనానికి సంబంధించిన ఒప్పందాన్ని నిలుపుదల చేస్తూ నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం రిలయన్స్ షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 215.12 పాయింట్ల నష్టంతో 54277.72 వద్ద.. నిఫ్టీ 56.40 పాయింట్ల నష్టంతో 16238.20 వద్ద ముగిశాయి. ఇక నేటి సెషన్లో వోడాఫోన్ ఐడియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా కెమికల్స్, ఆర్తి ఇండస్ట్రీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్, ఎల్&టీ ఇన్ఫోటెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర షేర్లు లాభాలను పొందాయి. కాగా, సిప్లా, రిలయన్స్, ఎస్కార్ట్స్, శ్రీ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ, ఫైజర్, ఏక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టాలు నమోదు చేశాయి.