Trent Bridge: ట్రెంట్ బ్రిడ్జ్ లో వెలుతురు లేమితో నిలిచిన ఆట... అప్పటికే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా
- ట్రెంట్ బ్రిడ్జ్ లో టీమిండియా, ఇంగ్లండ్ తొలిటెస్టు
- తొలి ఇన్నింగ్స్ లో 183 రన్స్ చేసిన ఇంగ్లండ్
- భారత్ కు శుభారంభం
- ఆపై వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన వైనం
ట్రెంట్ బ్రిడ్జ్ లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు వెలుతురు లేమి కారణంగా నిలిచిపోయింది. ఆట ఆగిన కాసేపటికే వరుణుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 125 పరుగులు చేసిన స్థితిలో వెలుతురు లేమితో మ్యాచ్ ను నిలిపివేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 57, రిషబ్ పంత్ 7 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, ఆ స్కోరుకు భారత్ ఇంకా 58 పరుగులు వెనుకబడి ఉంది.
ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ కు 2, ఓల్లీ రాబిన్సన్ కు ఓ వికెట్ దక్కాయి. ఓపెనర్ రోహిత్ శర్మ 36 పరుగులు చేయగా, వన్ డౌన్ లో వచ్చిన పుజారా 4 పరుగులకే వెనుదిరిగాడు. ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కావడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న అజింక్యా రహానే 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ కావడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి.