Somireddy Chandra Mohan Reddy: ఎమ్మెల్యే కాకాణి తన అనుచరుడితో ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ చేయించారు: సోమిరెడ్డి ఆరోపణలు

Somireddy fires on MLA Kakani Govardhan Reddy

  • మరోసారి కాకాణి వర్సెస్ సోమిరెడ్డి
  • అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారన్న సోమిరెడ్డి
  • మాగుంటను బలిచేస్తున్నారని వెల్లడి
  • సీఎం జోక్యం చేసుకోవాలని సూచన

టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన దోపిడీ కోసం కాకాణి సొంత పార్టీకి చెందిన ఎంపీనే బలి చేయడానికి సిద్ధపడ్డాడని అన్నారు. మైనింగ్ అనుమతుల కోసం కాకాణి తన అనుచురుడితో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేయించారని వివరించారు. తద్వారా సర్వేపల్లి రిజర్వాయర్ గ్రానైట్ తవ్వకానికి అక్రమ రీతిలో దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

అయితే, తన అక్రమ భాగోతంపై ఫిర్యాదులు రావడంతో కాకాణి ఆఖరికి సొంత పార్టీ ఎంపీ మాగుంటను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. కాకాణి, ఎంపీ శ్రీనివాసులు రెడ్డిపైనే తప్పుడు కేసు పెట్టించారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఒకవేళ మాగుంటే తవ్వకాలకు దరఖాస్తు చేసుకుని ఉంటే పోలీసులు ఎందుకు విచారణ జరిపించలేదని సోమిరెడ్డి నిలదీశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో వాహనాలను పట్టుకున్న పోలీసులు ఎవరి ఆదేశాల మేరకు మాగుంట పేరును ఏ-2గా చేర్చారని ప్రశ్నించారు.

ఈ వ్యవహారంలో సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని, మాగుంట కుటుంబం పరువు కాపాడాలని అన్నారు. అక్రమ మైనింగ్ పై దృష్టి సారించాలని కోరారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరిస్థితి చూస్తుంటే జాలి కలుగుతోందని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News