Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలో భక్తుల దర్శనాలకు ముహూర్తం నిర్ణయించిన ఆలయ ట్రస్టు
- 2023 నాటికి గర్భగుడి పూర్తి
- అదే ఏడాది డిసెంబరు నుంచి దర్శనాలు
- 2025 నాటికి ఆలయం పరిపూర్తి
- ప్రాంగణంలో మ్యూజియం, రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో, ఇటీవలి వరకు దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించారు. భారీగా విరాళాలు సేకరించిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేసింది. కాగా, 2023 డిసెంబరు నాటికి ఆలయంలో భక్తులకు శ్రీరాముడి దర్శనాలకు అనుమతిస్తామని ట్రస్టు వర్గాలు వెల్లడించాయి. అప్పటికి గర్భగుడితో పాటు గ్రౌండ్ ఫ్లోర్ లో 5 మంటపాల నిర్మాణం పూర్తవుతుందని వివరించాయి. గ్రౌండ్ ఫ్లోర్ సిద్ధం కాగానే రామ్ లాలా విగ్రహాలను గర్భగుడిలో ప్రతిష్టాపన చేస్తామని తెలిపాయి.
అయితే, రామమందిరం నిర్మాణం సమగ్ర రీతిలో పూర్తయ్యేందుకు 2025 వరకు సమయం పడుతుందని ట్రస్టు వర్గాలు పేర్కొన్నాయి. ఆలయ సముదాయంలో ఓ రీసెర్చ్ కేంద్రంతో పాటు మ్యూజియం, లైబ్రరీ (డిజిటల్ ఆర్కైవ్స్) కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించాయి.