King Cobra: తూర్పు గోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం... ఎంత పెద్దదో!
- చింతలూరులో కనిపించిన రాచనాగు
- ఓ సరుగుడు తోటలో సంచారం
- హడలిపోయిన స్థానికులు
- పామును పట్టుకోవాలంటూ అధికారులకు విజ్ఞప్తి
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం, చింతలూరులో భారీ కింగ్ కోబ్రా కనిపించింది. పెద్ద చెరువు వెనుకభాగంలో ఒడ్డు లోవరాజు, సూరిబాబు అనే వ్యక్తులకు చెందిన సరుగుడు తోటలో కింగ్ కోబ్రాను చూసిన స్థానికులు హడలిపోయారు. ఇది 12 అడుగుల పొడవుతో భీతి గొలిపేలా ఉండడంతో దీన్ని సమీపించేందుకు అక్కడివారికి ధైర్యం చాల్లేదు. దూరం నుంచి తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు.
ఈ రాచనాగును పట్టుకుని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టాలని చింతలూరు ప్రజలు అటవీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాగా, జనాల అలికిడి కావడంతో ఆ విషసర్పం అక్కడ్నించి నిష్క్రమించింది.