Jagan: కూ యాప్ లో ఖాతా తెరిచిన సీఎం జగన్
- ప్రజాదరణ పెంచుకుంటున్న దేశీయ యాప్
- కూ యాప్ లో వైఎస్ జగన్ వ్యక్తిగత ఖాతా
- సీఎంవో, వైసీపీ కూడా ఖాతాలు తెరిచిన వైనం
- జగన్ రాకను స్వాగతించిన కూ వ్యవస్థాపకులు
ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపుతో మరింత ఉత్సాహంగా కార్యకలాపాలు సాగిస్తున్న కూ యాప్ క్రమంగా ప్రజాదరణ పొందుతోంది. తాజాగా కూ యాప్ లో ఏపీ సీఎం జగన్ కూడా ప్రవేశించారు. ఆయన ఈ సోషల్ నెట్వర్కింగ్ యాప్ లో ఖాతా తెరిచారు. అంతేకాదు, తన అధికారిక సమీక్షలతో పాటు, భారత మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్ టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన విషయాన్ని కూడా కూ యాప్ లో పోస్టు చేశారు. సీఎం జగన్ తో పాటు, ఏపీ సీఎంవో, వైసీపీ, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కూడా కూలో ఖాతాలు తెరిచాయి.
దీనిపై కూ యాప్ వ్యవస్థాపకుడు, సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ స్పందిస్తూ, ఏపీ గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కూ యాప్ లోకి స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ఈ వేదికపై సీఎం జగన్ తో ఆయన ఫాలోవర్స్ ఎంతో సులువుగా సంప్రదింపులు జరిపే వీలుంటుందని, ఆయన అభిప్రాయాలను నిత్యం గమనిస్తూ ఉండొచ్చని వివరించారు.
కూ యాప్ సహవ్యవస్థాపకుడు మయాంక్ బిదావట్కా స్పందిస్తూ, ఈ వేదికపై సీఎం జగన్ రాకతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజానీకానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు.
దేశంలో ట్విట్టర్ పై రాజకీయ దుమారం కొనసాగుతున్న నేపథ్యంలో, గత కొన్నినెలలుగా కూ యాప్ డౌన్ లోడ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. రాజకీయ ప్రముఖులే కాదు, సినీ స్టార్లు కూడా కూ యాప్ లో ఖాతాలు తెరుస్తున్నారు.