YS Jagan: లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు.. డిశ్చార్జ్ పిటిషన్ల దాఖలుకు గడువు కోరిన జగన్, విజయసాయి
- లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో జగన్ ప్రధాన నిందితుడు
- గీతారెడ్డి, శామ్యూల్ పిటిషన్లపై విచారణ 16కు వాయిదా
- హైకోర్టులో స్టేలు లేని నిందితులు వాదనలకు సిద్ధంగా ఉండాలని సీబీఐ కోర్టు ఆదేశం
లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ సంస్థ ప్రతినిధులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ల దాఖలుకు తమకు మరింత గడువు కావాలని జగన్, విజయసాయిరెడ్డి నిన్న సీబీఐ కోర్టును అభ్యర్థించారు. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఐఏఎస్ శామ్యూల్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 16కు వాయిదా పడింది.
మరోవైపు, రాంకీ కేసులో మూడో నిందితుడైన అయోధ్యరామిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై నిన్న సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా పడింది. అలాగే, వాన్‌పిక్ దాల్మియా, అరబిందో-హెటిరో, జగతి పబ్లికేషన్స్ కేసుల విచారణ కూడా ఈ నెల 12కు వాయిదా పడింది. ఇందూ హౌసింగ్ బోర్డు కేసును కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. హైకోర్టులో స్టేలు లేని నిందితుల అభియోగాల విషయంలో వాదనలకు సిద్ధంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.