USA: గేట్స్​ దంపతులకు విడాకులు మంజూరు

Court Dissolves Gates Marriage

  • ఆస్తులను సమానంగా పంచుకోవాలని జడ్జి ఆదేశం
  • అంతా రహస్యంగా జరిగిపోవాలని సూచన
  • మెలిందా పేరిట ఇప్పటికే 300 కోట్ల డాలర్ల షేర్ల బదిలీ

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్, మెలిందా గేట్స్ తమ 27 ఏళ్ల వివాహ బంధానికి అధికారికంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాము విడిపోతున్నట్టు మూడు నెలల క్రితమే వారు ప్రకటించినా.. తాజాగా ఇవాళ కోర్టు విడాకులను మంజూరు చేసింది. వాషింగ్టన్ లోని కింగ్ కౌంటీ కోర్టు జడ్జి వారి వివాహాన్ని రద్దు చేశారు.

విడాకుల ఒప్పందానికి తగ్గట్టు ఆస్తులను పంచుకోవాల్సిందిగా ఆదేశించారు. షరతుల ప్రకారం ఆ వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచాలన్నారు. కాగా, విడాకుల విషయం బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే మెలిందా ఫ్రెంచ్ గేట్స్ పేరిట 300 కోట్ల డాలర్ల విలువైన షేర్లను బిల్ గేట్స్ బదిలీ చేశారు. ప్రస్తుతం గేట్స్ దగ్గర 15,000 కోట్ల డాలర్ల సంపద ఉంది. ఆ ఆస్తులను ఎలా విభజిస్తారన్న దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.

వాషింగ్టన్ రాష్ట్రం చట్టాల ప్రకారం.. పెళ్లి తర్వాత సంపాదించిన దాంట్లో దంపతులిద్దరికీ సమాన వాటా ఉంటుంది. దాని ప్రకారం ఆస్తిని న్యాయప్రకారం సమానంగా పంచాలని జడ్జి ఆదేశించారు. కాగా, విడాకుల ప్రకటన వెలువడినప్పటి నుంచీ గేట్స్ ఫౌండేషన్ భవిష్యత్ పైనే అనుమానాలు నెలకొన్నాయి. ఫౌండేషన్ బోర్డు సభ్యుల్లో ఒకరైన వారెన్ బఫెట్ .. జూన్ లో ట్రస్టీ పదవి నుంచి తప్పుకొన్నారు.

బోర్డులో మరింత మంది సభ్యులను చేర్చుతామని ఫాండేషన్ ప్రకటించింది. బిల్ గేట్స్ తో కలిసి పనిచేయలేకపోతే మరో రెండేళ్లలోనే మెలిందా కూడా బోర్డు నుంచి తప్పుకోవచ్చన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత లింగ సమానత్వం కోసం ఏర్పాటు చేసిన ‘పైవోటల్ వెంచర్స్’ అనే సంస్థ కోసం జులై 30న మెలిందా సంతకం చేసింది.

  • Loading...

More Telugu News