JC Prabhakar Reddy: అధికారుల తీరుపై తీవ్ర నిరసన.. మునిసిపల్ సిబ్బందికి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఒంగి నమస్కారాలు

JC Prabhakar Reddy fires on Municipal Officials

  • సమావేశానికి గైర్హాజరైన మునిసిపల్ సిబ్బంది
  • అదే సమయంలో ఎమ్మెల్యే నిర్వహించిన ర్యాలీకి హాజరైన సిబ్బంది
  • కమిషనర్ వచ్చే వరకు కదిలేది లేదంటూ రాత్రంతా కార్యాలయంలోనే
  • 26 మంది సిబ్బంది కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు

మునిసిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. నిన్న ఉదయం పదిన్నర గంటలకు మునిసిపల్ చైర్మన్ హోదాలో సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని శనివారమే అందరికీ తెలియజేశారు.

అయితే, అదే సమయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మునిసిపల్ సిబ్బందితో కరోనా వైరస్ మూడో దశపై అవగాహన ర్యాలీ, సమీక్ష సమావేశం నిర్వహించడంతో వారందరూ దానికి హాజరయ్యారు. అయితే, ర్యాలీ అనంతరం సమావేశానికి వస్తారని భావించిన జేసీ 12.30 గంటల వరకు కౌన్సిలర్లతో కలిసి కార్యాలయంలో ఎదురుచూస్తూ కూర్చున్నారు.

అయితే, ర్యాలీ అనంతరం సిబ్బంది ఇళ్లకు వెళ్లిపోయారు. కమిషనర్ నరసింహప్రసాద్‌రెడ్డి మధ్యాహ్నం సెలవుపై వెళ్తూ ఇతరులకు బాధ్యతలు అప్పగించారు. విషయం తెలిసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి అధికారులు కార్యాలయాలకు వచ్చే వరకు వెళ్లేది లేదంటూ తన చాంబర్‌లోనే ఉండిపోయారు. చివరికి నాలుగున్నర గంటలకు అధికారులు రాగానే జేసీ లేచి వారికి ఒంగిఒంగి దండాలు పెట్టారు.

అంతేకాదు, తనకు సమాచారం ఇవ్వకుండా కమిషనర్ ‌సెలవుపై ఎలా వెళ్తారంటూ  ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, తన ఆదేశాలను బేఖాతరు చేసిన 26 మంది సిబ్బందికి నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. కమిషనర్ వచ్చే వరకు కార్యాలయంలో ఉంటానని చెప్పిన ఆయన.. రాత్రి భోజనం చేసి అక్కడే నిద్రపోయారు. అంతకుముందు ఆయన మునిసిపల్ సిబ్బంది 26 మంది కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

JC Prabhakar Reddy
Tadipatri
TDP
Anantapur District
  • Loading...

More Telugu News