KCR: అనాథ పిల్లల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందించాలి: కేసీఆర్

Telangana Cabinet taken key decisions
  • కేసీఆర్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం
  • సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్ ఆసుపత్రులను కూడా ‘టిమ్స్’గా పిలవాలని నిర్ణయం
  • అనాథల సంక్షేమం కోసం విధాన రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధాప్య పింఛన్ల అర్హతను 57 ఏళ్లకు తగ్గించిన ప్రభుత్వం ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. అనాథ శరణాలయాల స్థితిగతులను సమీక్షించడంతో పాటు వారి సంక్షేమానికి విధాన రూపకల్పన కోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.

కొత్తగా మంజూరు చేసిన ఏడు వైద్య కళాశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని, గచ్చిబౌలితోపాటు సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్ ఆసుపత్రులను ‘టిమ్స్’గా పిలవాలని, హైదరాబాద్ నిమ్స్‌ను మరింత అభివృద్ధి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.

కరోనా మూడో దశ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు తీవ్ర మానసిక వేదన ఎదుర్కొంటున్నారని, వారి కాళ్లమీద వాళ్లు నిలబడి ప్రయోజకులయ్యేంత వరకు ప్రభుత్వమే అండగా నిలవాలని కేసీఆర్ అన్నారు. గతంలో అనాథలకు బీసీ హోదా ఇవ్వడంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వారి రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వారి విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మానవీయ కోణంలో స్పందించాలని కేసీఆర్ పేర్కొన్నారు.
KCR
Telangana Cabinet
Orphan
TIMS

More Telugu News