rocket: ఆఫ్ఘన్ విమానాశ్రయంపై రాకెట్లతో దాడి
- రెచ్చిపోతోన్న తాలిబన్లు
- కాందహార్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు
- విమానాశ్రయ రన్‌వేపై పడ్డ రాకెట్లు
- కొనసాగుతోన్న మరమ్మతు పనులు
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరిగిన నేపథ్యంలో.. ఆఫ్ఘన్‌లో తాలిబన్ల ప్రభావం మళ్లీ పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబన్లు దాడులకు పాల్పడ్డారు. గత రాత్రి రెండు రాకెట్లు విమానాశ్రయంలోని రన్‌వేపై వచ్చి పడడంతో విమాన రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది.
ప్రస్తుతం రన్‌వే మరమ్మతు పనులు జరగుతున్నాయని, ఈ రోజు మధ్యాహ్నంలోపు విమాన సేవలు పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. కాగా, ఇప్పటికే ఆఫ్ఘన్‌లోని అనేక ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు కాందహార్ ను కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయంపై దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది.