PV Sindhu: ఈ రోజు నాది కాదు: పీవీ సింధు
- టోక్యో ఒలింపిక్స్ లో సింధుకు నిరాశ
- బ్యాడ్మింటన్ సెమీస్ లో ఓటమి
- సింధుపై నెగ్గిన తై జు యింగ్
- రేపు కాంస్యం కోసం ఆడనున్న సింధు
- సర్వశక్తులు ఒడ్డుతానని వెల్లడి
కోట్లాది మంది భారతీయుల ఆశలను మోసుకుంటూ జపాన్ వెళ్లిన బ్యాడ్మింటన్ తార పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ లో ఓటమిపాలవడం అందరినీ విచారానికి గురిచేస్తోంది. ఇవాళ జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్ సమరంలో సింధు చైనీస్ తైపే షట్లర్, వరల్డ్ నెంబర్ వన్ తై జు యింగ్ చేతిలో ఓడిపోయింది. తన ఓటమిపై సింధు స్పందించింది. తై జు యింగ్ తో తాను గతంలో అనేక మ్యాచ్ లు ఆడానని, ఆమె బలాబలాలపై అవగాహన ఉందని తెలిపింది. అయితే, ఇవాళ్టి కీలక పోరులో ఆమెదే పైచేయి అయిందని వివరించింది.
"ప్రతి పాయింటు కోసం శక్తివంచన లేకుండా పోరాడాను. కానీ ఈ రోజు నాది కాదు. ఓటమి ఎప్పుడైనా బాధాకరమే. అయితే ఫైనల్ ముంగిట వెనుదిరగడం మరింత బాధిస్తోంది. టోక్యో ఒలింపిక్స్ లో నా ప్రస్థానం ఇంకా ముగియలేదు. నాకింకా కాంస్యం గెలిచే అవకాశం ఉంది. నాకు ఎంతోమంది అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.. రేపు కాంస్యం కోసం జరిగే మ్యాచ్ లో సర్వశక్తులు ఒడ్డుతాను" అని వివరించింది.