Devineni Uma: జైల్లో తన భర్త దేవినేని ఉమకు ప్రాణహాని ఉందంటూ భార్య అనుపమ గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలకు లేఖలు
- ఎస్సీఎస్టీ కేసులో ఉమ అరెస్ట్
- రాజమండ్రి జైల్లో రిమాండ్
- జైలు సూపరింటిండెంట్ బదిలీ
- అనుమానాలు కలిగిస్తోందన్న ఉమ భార్య
- జైల్లో భద్రత కల్పించాలని విజ్ఞప్తి
ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న టీడీపీ నేత దేవినేని ఉమ ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్నారు. కాగా, తన భర్తకు జైల్లో ప్రాణహాని ఉందంటూ దేవినేని ఉమ భార్య అనుపమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్రాల హోంమంత్రులకు లేఖ రాశారు.
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ ను ఆగమేఘాలపై బదిలీ చేయడం పలు అనుమానాలు, ఆందోళనలకు తావిస్తోందని తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా జైల్లో తన భర్తకు తగిన భద్రత కల్పించాలని ఆమె కోరారు. పదవిలో ఉన్నా లేకపోయినా, తన భర్త దేవినేని ఉమ ప్రజా జీవితంలో ఎంతో చురుగ్గా ఉన్నారని తెలిపారు. ఆయన అవినీతికి తీవ్ర వ్యతిరేకి అని, అక్రమ మైనింగ్ పై మొదటి నుంచి పోరాడుతున్నారని వివరించారు.
అందుకే మైనింగ్ మాఫియా తన భర్తను లక్ష్యంగా చేసుకున్నట్టు అనుపమ లేఖలో ఆరోపించారు. తన భర్త ప్రాణాలకే కాకుండా, తమ ఆస్తులకు, ఇతర కుటుంబ సభ్యులకు తీవ్ర ముప్పు కలుగజేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. కాగా, రాజమండ్రి జైలు సూపరింటిండెంట్ బదిలీ ఉత్తర్వులను కూడా దేవినేని అనుపమ తన లేఖల్లో పొందుపరిచారు.