Talibans: పోలీస్ 'కమెడియన్' ను చంపేసినట్టు అంగీకరించిన తాలిబన్లు
- ఫజల్ అనే పోలీసును కిడ్నాప్ చేసిన తాలిబన్లు
- రెండు వీడియోలు వైరల్
- ఓ వీడియోలో ఫజల్ ను కొడుతున్న దృశ్యాలు
- మరో వీడియోలో ఫజల్ మృతదేహం
- కామెడీ పోస్టులతో అలరించే ఫజల్
ఆఫ్ఘనిస్థాన్ గడ్డపై తాలిబన్ల దురాగతాల జాబితాలో మరో విషాద ఘటన చేరింది. హాస్యం పుట్టించే సోషల్ మీడియా పోస్టులతో అందరినీ అలరించే పోలీసు అధికారి ఫజల్ మహ్మద్ ను హత్య చేసినట్టు తాలిబన్లు అంగీకరించారు. ఫజల్ మహ్మద్ ను స్థానికులు ఖాషా జ్వాన్ అని పిలుస్తుంటారు. దక్షిణ ఖాందహార్ ప్రావిన్స్ లో విధులు నిర్వర్తిస్తున్న ఈ కామెడీ పోలీసు అధికారిని రెండు వారాల కిందట తాలిబన్లు అపహరించారు.
అయితే, ఇటీవల విడుదలైన రెండు వీడియోలు ఆయన మరణించినట్టు వెల్లడించాయి. ఓ వీడియోలో... ఓ వాహనంలో ఫజల్ మహ్మద్ కూర్చుని ఉండగా, ఓ తాలిబన్ అతడిని కొడుతుండడం చూడొచ్చు. మరో వీడియోలో ఫజల్ మృతదేహం దర్శనమిచ్చింది. ఆ పోలీసు అధికారి మరణాన్ని తాలిబన్లు ధ్రువీకరించారు.
తాలిబన్ల అధికార ప్రతినిధి జబీయుల్లా ముజాహిద్ మాట్లాడుతూ, అతడేమీ కమెడియన్ కాదని, తమకు వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో పాల్గొన్నాడని వివరించారు. ఇతడు పోలీసు విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడని, అనేకమంది ప్రజల మృతికి కారకుడని ఆరోపించారు. తాము అతడిని నిర్బంధించగానే పారిపోయేందుకు ప్రయత్నించాడని, దాంతో తమ సాయుధులు అతడిని చంపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని జబీయుల్లా వివరణ ఇచ్చారు.
అయితే, ఫజల్ తో పనిచేసిన సైలాబ్ అనే పోలీసు అధికారి స్పందిస్తూ, అతడెప్పుడూ పోరాటాల్లో పాల్గొనలేదని, కానీ తనిఖీ కేంద్రాల వద్ద అధికారులకు వినోదం పంచుతుండేవాడని వెల్లడించారు.