Atchannaidu: దేవినేని ఉమకు హాని తలపెట్టేందుకే జైలు సూపరింటిండెంట్ బదిలీ: అచ్చెన్నాయుడు
- దేవినేని ఉమపై కేసు నమోదు
- వచ్చే నెల 10 వరకు రిమాండ్
- రాజమండ్రి జైలుకు తరలింపు
- జైలు అధికారి బదిలీపై వివరణ ఇవ్వాలన్న అచ్చెన్న
టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. కొండపల్లి ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించి వస్తున్న ఆయన తమపై దాడి చేశాడని వైసీపీ వర్గాలు ఫిర్యాదు చేశాయి. దాంతో ఉమపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా, వచ్చే నెల 10 వరకు రిమాండ్ విధించారు.
ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమకు హాని తలపెట్టడం కోసం జైలు సూపరింటిండెంట్ ను బదిలీ చేశారని ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటిండెంట్ బదిలీపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొండపల్లిలో అక్రమ తవ్వకాలను ప్రశ్నించినందుకే ఉమపై దాడి జరిగిందని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఉమపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో దేవినేని ఉమకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు.