international space station: అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో భారీ కుదుపు.. తప్పిన పెను ప్రమాదం
- రష్యా గతవారం కజఖ్‌స్థాన్‌లోని బైకనూర్ నుంచి పంపిన మాడ్యూలే కారణం
- అంతరిక్ష కేంద్రానికి మాడ్యూల్ అనుసంధానం
- కొన్ని గంటల్లోనే థ్రస్టర్లలో మంటలు
- నియంత్రించిన గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థ
అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎస్ఎస్) కుదుపునకు గురైంది. రష్యా గతవారం కజఖ్‌స్థాన్‌లోని బైకనూర్ నుంచి పంపిన కొత్త మాడ్యూలే ఇందుకు కారణం. అంతరిక్ష కేంద్రానికి ఆ మాడ్యూల్ అనుసంధానమైన కొన్ని గంటల్లోనే థ్రస్టర్లలో మంటలు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
అంతరిక్ష కేంద్రం దిశ అదుపు తప్పడంతో భూమిపై నుంచి దాని కదలికల్ని పర్యవేక్షించే గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థలోని బృందం కొన్ని నిమిషాల్లోనే తిరిగి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతరిక్ష పరిశోధనా కేంద్రంలోని వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రకటించింది.
కాగా, 23 టన్నుల బరువు ఉండే ‘నాకా’ అనే కొత్త మాడ్యూల్‌ను గతవారం రష్యా పంపగా, అది నిన్న ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమైంది. భూమిపై ఉన్న రష్యా గ్రౌండ్ కంట్రోల్ బృందం సంబరాలు చేసుకున్నారు. ఆ కొద్దిసేపటికే థ్రస్టర్లు అనుకోకుండా మండడంతో ఆందోళన చెందారు. అంతరిక్ష పరిశోధనా కేంద్ర భ్రమణం సెకనుకు సగం డిగ్రీ చొప్పున మారిందని శాస్త్రవేత్తలు చెప్పారు.
దీంతో, ఐఎస్‌ఎస్ ఉండాల్సిన స్థితి కంటే 45 డిగ్రీలు అదనంగా పక్కకు ఒరిగిందని వివరించారు. అనంతరం గంట వ్యవధిలో ఐఎస్‌ఎస్ తిరిగి నిర్దేశిత స్థితికి చేరుకుందని వివరించారు. అయితే, మరో 12 నిమిషాల పాటు భ్రమణం అలాగే కొనసాగి ఉంటే అంతరిక్ష కేంద్రం పూర్తిగా వ్యతిరేక దిశకు చేరుకునేదని చెప్పారు.
అదే కనుక జరిగితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతరిక్ష కేంద్రంపై ఉండే సోలార్ ప్యానెల్స్ ఎల్లప్పుడూ సూర్యునికి అభిముఖంగా ఉండాలి. ఈ విధంగానే అంతరిక్ష కేంద్రం ఎల్లప్పుడూ దిశ మార్చుకుంటుంది. ఒకవేళ సోలార్ ప్యానెల్స్ పై కిరణాలు పడకపోతే అంతరిక్ష కేంద్రంలో ఉండే ఇంధన వ్యవస్థ దెబ్బతిని, దాని పనితీరు పాడవుతుంది.
ఉష్ణోగ్రతలు మారి, అందులోని వ్యోమగాములకు ముప్పు సంభవించవచ్చు. అంతరిక్ష కేంద్రం నుంచి గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థకు కమ్యూనికేషన్స్ కట్ అవుతాయి. కాగా, అంతరిక్ష కేంద్రంలో చోటు చేసుకున్న కుదుపునకు గల కారణాలను పరిశీలిస్తామని రష్యా తెలిపింది.