Basavaraj Bommai: నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా: కర్ణాటక కొత్త సీఎం బొమ్మై
- నేడు హుబ్బళ్లికి వెళ్లిన బసవరాజ్ బొమ్మై
- సీఎంగా ఇక్కడ అడుగుపెడతానని ఎప్పుడూ అనుకోలేదని వ్యాఖ్య
- మోదీ, అమిత్ షా ఆశీర్వాదాలు తీసుకునేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నానన్న బొమ్మై
కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత హుబ్బళ్లికి (హుబ్లి) బసవరాజ్ బొమ్మై తొలిసారి విచ్చేశారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హుబ్బళ్లికి చేరుకున్న ఆయనకు అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను హుబ్బళ్లిలోనే పుట్టా, పెరిగానని చెప్పారు. ఇక్కడ తనకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారని తెలిపారు. సీఎం హోదాలో తాను ఇక్కడ అడుగుపెడతానని ఎప్పుడూ భావించలేదని చెప్పారు. తనకు ఇంతటి పెద్ద బాధ్యతను అప్పగించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా తనను ఆశీర్వదించారని చెప్పారు.
మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్, జేపీ నడ్డా ఆశీర్వాదాలను తీసుకునేందుకు రేపు ఢిల్లీకి వెళ్తున్నానని బొమ్మై తెలిపారు. ఆ తర్వాత రెండు, మూడు రోజుల్లో మరోసారి అపాయింట్ మెంట్ తీసుకుని వారిని కలుస్తానని... కొత్త కేబినెట్ పై చర్చిస్తానని చెప్పారు. ఈరోజు ఉత్తర కన్నడ జిల్లాల్లో బొమ్మై పర్యటించారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు.