Pakistan: తాలిబన్లూ మామూలు మనుషులే.. వారినెలా చంపుతాం?: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- తాలిబన్లకు పాక్ స్వర్గధామమనేందుకు ఆధారాలేంటి?
- అమెరికా సైనిక దాడి చేసి తప్పు చేసింది
- పై చేయి ఉన్నప్పుడే రాజకీయ పరిష్కారానికి రావాల్సింది
- 'బలహీన పడ్డాక చేస్తే ఏం లాభం?' అన్న ఇమ్రాన్
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రజలపై తాలిబన్లు అరాచకాలకు పాల్పడుతున్నా.. ‘వారు మామూలు మనుషులే’ అంటూ మాట్లాడారు. పాకిస్థాన్ లోని ఓ వార్తా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘తాలిబన్లేమీ సైనికులు కాదు.. వారూ మామూలు మనుషులే. మా దేశ సరిహద్దుల్లో 30 లక్షల మంది ఆఫ్ఘన్ శరణార్థులు గుడారాలేసుకుని ఉంటున్నారు. వాళ్లలో కొందరు ఆ ‘సామాన్య ప్రజలూ’ ఉన్నారు. అలాంటప్పుడు ఆ సామాన్య ప్రజలను మేమెలా వేటాడి చంపేస్తాం?’’ అని అన్నారు.
తాలిబన్లకు పాకిస్థాన్ స్వర్గధామంలా మారిందని చెబతున్నవారు.. అందుకు సరైన ఆధారాలను ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రశ్నించారు. శరణార్థి శిబిరాలున్నంతమాత్రాన వాటిని తాలిబన్లకు స్వర్గధామమంటూ ఎలా అంటారని ప్రశ్నించారు. తాలిబన్లకు పాకిస్థాన్ ఆర్థికంగా తోడ్పాటునందించి.. ఆయుధాలనూ సరఫరా చేస్తోందన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అవి నీచ ప్రచారాలని, అలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వారు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
అమెరికాలో 9/11 దాడుల తర్వాత తాము అమెరికాకు సాయం చేశామని, ఉగ్రవాద వ్యతిరేక పోరులో తమవంతు కృషి చేశామని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ లో సైనిక దండయాత్ర చేసి అమెరికా పెద్ద తప్పు చేసిందని ఇమ్రాన్ అన్నారు. పై చేయి ఉన్నప్పుడే తాలిబన్లతో రాజకీయ పరిష్కారం చేయకుండా, బలహీన దశలో చేసుకుందని చెప్పారు. బలగాలు 10 వేలకు తగ్గాక, ఆఫ్ఘన్ నుంచి వెళ్లిపోయే ముందు రాజకీయ రాజీ చేసుకుంటే లాభం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు తామే గెలిచామంటూ తాలిబన్లు అనుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో వారితో రాజీకి రాలేమని అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్ లో పౌర యుద్ధం వచ్చే పరిస్థితులూ ఉన్నాయన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా అమెరికా, తాలిబన్ల మధ్య చర్చలకు తాను సాయం చేస్తానని ఇమ్రాన్ చెప్పారు. చర్చలు జరిగేందుకు మాత్రమే సాయం చేస్తామని, మిగతా ఎలాంటి విషయాల్లోనూ అమెరికాతో సంబంధాలు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. దేశంలో అమెరికా సైనిక బేస్ ల ఏర్పాటుకూ అంగీకరించబోమని చెప్పారు.